🔥 రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు!
హైదరాబాద్, ఏప్రిల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఎండలతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీయవచ్చని అంచనా.
ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు.

Post a Comment