హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడుతోంది. నిజాంపేట్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్ ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురుస్తోంది.
అలాగే సూరారం, దుండిగల్, గండిమైసమ్మ, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడ్‌పల్లిలోనూ ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతోంది. చింతల్‌లో ఈదురుగాలుల కారణంగా ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో పాటు రెండు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవడంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్‌పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. నిజాంపేట్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, జీడిమెట్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Post a Comment