స్కూటీని కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్లోని మైండ్‌స్పేస్ సమీపంలో రాత్రి సమయంలో స్కూటీపై వెళ్తున్న దంపతులను డీసీఎం వాహనం ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆగాల్సిన డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, స్కూటీని సుమారు కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ భయానక ఘటనలో ఆయేషా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతురాలు, ఆమె భర్త కేరళకు చెందినవారు. ప్రస్తుతం వారు మహేశ్వరం సమీపంలో నివసిస్తూ Malabar Gold & Diamondsలో ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రమాదం అనంతరం డీసీఎం డ్రైవర్ పరారయ్యాడు. ఆగ్రహించిన స్థానికులు వాహనంలోని క్లీనర్‌ను పట్టుకుని దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment