తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభం: సీఈవో సుదర్శన్ రెడ్డి
తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ ప్రారంభం: సీఈవో సుదర్శన్ రెడ్డి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను జూన్ 25 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా ఇప్పటికే SIR ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రంలో కూడా ఎన్నికల జాబితా శుద్ధి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి ఓటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. కొత్త ఓటర్ల వివరాలను ఫారం-6లో ప్రత్యేకంగా నమోదు చేస్తామని పేర్కొన్నారు.
అలాగే, వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఎన్యుమరేషన్ సదుపాయం కల్పించామని, హెల్ప్‌లైన్ 1950తో పాటు “Book a Call with BLO” సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.
ఎన్యుమరేషన్ దశలో ఫారం తప్ప అదనపు పత్రాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఫారం సమర్పించిన వారందరి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చబడతాయని, ఫారం ఇవ్వని వారి వివరాలను బూత్ వారీగా ప్రదర్శిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తామని తెలిపారు.
పుట్టిన తేదీ ఆధారంగా పత్రాల సమర్పణకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని సీఈవో వివరించారు.
- 1987 జూలై 1కు ముందు జన్మించిన వారికి ఒకే పత్రం సరిపోతుంది.
- 1987 నుంచి 2004 మధ్య జన్మించిన వారు తమ తల్లిదండ్రుల వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
- 2004 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల పత్రాలు తప్పనిసరి.
రాష్ట్రంలో ప్రస్తుతం 3.45 కోట్ల ఓటర్లు, సుమారు 35 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలతో కూడా SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
కీలక తేదీలు:
- జూన్ 25 నుంచి జూలై 24 వరకు — ఇంటింటి సర్వే
- జూలై 31 — డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
- జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు — అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబర్ 1 — తుది ఓటర్ల జాబితా విడుదల
18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే SIR ప్రధాన ఉద్దేశమని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Post a Comment