-->

అప్పుల వివాదం రెండు మహిళల ప్రాణాలు తీసింది

అప్పుల వివాదం రెండు మహిళల ప్రాణాలు తీసింది.. తాండూరు మిస్సింగ్ కేసు హత్యగా వెల్లడి

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కలకలం రేపిన ఇద్దరు మహిళల అదృశ్యం కేసు చివరకు దారుణ హత్యగా తేలింది. అప్పుల వ్యవహారమే ఈ జంట హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

తాండూరు పరిసర ప్రాంతాలకు చెందిన ఆబేదా బేగం, మహబూబాబి అనే ఇద్దరు మహిళలు ఇటీవల అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు. కాగా, హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్ వద్ద వారి మృతదేహాలు లభ్యమవడంతో కేసు మలుపు తిరిగింది.

మృతుల్లో ఒకరైన ఆబేదా బేగం బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం ఈ నెల 9వ తేదీన బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన ఆధారాలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. అప్పు తీసుకున్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామని నమ్మబలికి మహిళలను తాండూరు నుంచి మొయినాబాద్ సమీపంలోని ఫామ్‌హౌస్‌కు పిలిపించిన నిందితులు, అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో వారిద్దరినీ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

హత్య అనంతరం ఆధారాలు దొరకకుండా మృతదేహాలను అక్కడే పూడ్చిపెట్టినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే తాండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అప్పు ఇచ్చిన కారణంగా ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793