జూన్ 2 నుంచే ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు ప్రారంభించాలని Kalvakuntla Kavitha తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె, ఉద్యమకారుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి గడువు విధించారు.
ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకు 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సమరయోధుల పెన్షన్లు మంజూరు చేయాలని కవిత కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతూ, జూన్ 2 తర్వాత కూడా ఆలస్యం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం పట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మహిళలను పక్కన పెట్టడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు.
తెలంగాణ రక్షణ సేన, ఉద్యమకారుల సంఘాలు చేపట్టిన భూ పోరాటాలు, నిరసనల కారణంగానే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని పేర్కొన్న కవిత, కమిటీల పేరుతో కాలయాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని విమర్శించారు.
ఈ ఏడాది జూన్ 2 నుంచి ఉద్యమకారులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రారంభం కాకపోతే ఉద్యమకారులతో కలిసి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.

Post a Comment