-->

2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన షామీర్‌పేట్ తహసీల్దార్

2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన షామీర్‌పేట్ తహసీల్దార్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీర్‌పేట్ మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మరియు జాయింట్ సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 30 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ మరియు అనుమతుల కోసం సుచరిత రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.2 లక్షలను ఆమె ప్రైవేట్ డ్రైవర్ వి. నాగేష్ ద్వారా స్వీకరించిన సమయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు.

డ్రైవర్ నాగేష్ వద్ద నుంచి రూ.2 లక్షల లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.

ఈ కేసులో తహసీల్దార్ సుచరితతో పాటు డ్రైవర్ నాగేష్‌ను కూడా అరెస్ట్ చేసిన అధికారులు, వారిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793