-->

పిడుగు పాటుకు 30 పొట్టేళ్లు మృతి

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. పిడుగు పాటుకు 30 పొట్టేళ్లు మృతి


Nagarkurnool జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఉరుములు-మెరుపులతో కూడిన వాతావరణం తీవ్ర విషాదానికి దారితీసింది. కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామ శివారులోని వీరమనాయని చెరువు సమీపంలో పిడుగు పడటంతో రైతు ఎలగొండ వెంకటయ్యకు చెందిన 30 పొట్టేళ్లు అక్కడికక్కడే మృతి చెందాయి.

ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. పొట్టేళ్ల పెంపకమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటయ్య ఒక్కసారిగా తన జీవనోపాధిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి పెనుగాలులతో పాటు భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ సమయంలో చెరువు సమీపంలో మేత మేస్తున్న పొట్టేళ్లపై పిడుగు పడటంతో అవన్నీ దుర్మరణం చెందాయి. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మేకల నాగరాజు

ఈ ఘటన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్మనబెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత రైతు ఎలగొండ వెంకటయ్యను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మేకల నాగరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నిరంజన్ రావు, మాజీ సర్పంచ్ పాశం నాగరాజు యాదవ్, గ్రామ పెద్దలు పాల్గొని బాధిత రైతుకు ధైర్యం చెప్పారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793