-->

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు వసూలు

హైదరాబాద్‌లో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సి.డి. దశరథ్ కన్సల్టెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో సుమారు 90 మంది యువకులు మోసపోయినట్లు బాధితులు చెబుతున్నారు.

ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో మంచి జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా, ప్రకటనల ద్వారా ఆశ చూపిన కన్సల్టెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఆశపడ్డ యువకులను ఈజిప్ట్ వరకు తీసుకెళ్లిన నిర్వాహకులు అక్కడ మధ్యలోనే వదిలేసి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయడంతో విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు సొంత ఖర్చులతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా ఆఫీస్ మూసివేసి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంలో అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్రప్రసాద్ అనే నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరో భారీ వీసా మోసం.. రూ.10 కోట్ల దందా

ఇదిలా ఉండగా, గచ్చిబౌలిలోని “శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్” సంస్థ కూడా విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు బయటపడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ వంటి దేశాల్లో సాఫ్ట్‌వేర్, వేర్‌హౌజ్, సూపర్ మార్కెట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 150 మంది నిరుద్యోగుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంస్థ నిర్వాహకులు శ్రీ కిరణ్, నివేదితతో పాటు అరుణ్ కుమార్ అనే వ్యక్తి అభ్యర్థులను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు రవి అనే యువకుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం సంప్రదించగా, అతని నుంచి రూ.11 లక్షలు తీసుకున్నారని తెలిసింది. వీసా వచ్చిందని చెప్పి పంపిన పత్రాల్లో కీలక వివరాలను దాచిపెట్టి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత అది నకిలీ వీసా అని బయటపడింది.

అలాగే కూకట్‌పల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ప్రమోద్ కూడా రూ.13 లక్షలు చెల్లించి ఫేక్ వీసాతో మోసపోయాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల నుంచి రూ.18 లక్షల వరకు వసూలు చేసి భారీ స్థాయిలో మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

పది నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా సరైన న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలిలో పలువురు బాధితులు ఆందోళనకు దిగగా, తమ ఫిర్యాదులను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని వాపోయారు.

విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లే వారు జాగ్రత్త

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగం పేరుతో భారీ మొత్తంలో ముందస్తు డబ్బులు అడిగితే జాగ్రత్తగా వ్యవహరించాలని, సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా ధృవీకరించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793