అర్ధరాత్రి చైన్ స్నాచర్ల హల్‌చల్.. 9 తులాల బంగారం అపహరణ
తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామంలో అర్ధరాత్రి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గ్రామంలో వరుసగా మూడు ఇళ్ల వద్ద దుండగులు చోరీలకు పాల్పడి సుమారు 9 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి సుమారు 12:30 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేసవి కాలం కావడంతో మహిళలు ఇంటి బయట ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అత్యంత చాకచక్యంగా వారి మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల గొలుసులను లాక్కెళ్లినట్లు తెలిపారు.
ఘటన సమయంలో బాధితులు గాఢ నిద్రలో ఉండటంతో దుండగుల కదలికలను ఎవరూ గుర్తించలేకపోయినట్లు సమాచారం. ఒకే రాత్రిలో మూడు కుటుంబాలు చోరీలకు గురికావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ పహారా మరింత పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సమాచారం అందుకున్న తొర్రూరు పోలీసులు వెంటనే ఘటన స్థలాలకు చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment