-->

ప్రేమ పేరుతో దారుణం.. జడ్చర్లలో యువతిని కత్తితో హత్య

ప్రేమ పేరుతో దారుణం.. జడ్చర్లలో యువతిని కత్తితో హత్య


జడ్చర్లలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి(23)ను గుర్తు తెలియని యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.

పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న వైష్ణవి శనివారం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా యువకుడు ఆమెను వెంటాడాడు. తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో తల, మెడపై దాడి చేసి గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలింది.

దాడి అనంతరం నిందితుడు పారిపోతుండగా స్థానికులు వెంటాడి పట్టుకుని తాళ్లతో కట్టి చితకబాదారు. ఈ ఘటనలో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

నిందితుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. చివరకు తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవలే వైష్ణవికి వివాహం నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ దారుణం చోటుచేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

హత్య చేసి పారిపోతున్న సమయంలో స్థానికులు నిందితుడిని ప్రశ్నించగా, “రెండేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకుంది” అని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793