ఆపరేషన్ వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
కరీంనగర్: మే 09: కరీంనగర్ నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన ఆపరేషన్ అనంతరం మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని మంకమ్మతోట ప్రాంతంలో ఉన్న యశోదకృష్ణ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
మారుతి నగర్‌కు చెందిన బెదరకోట చంద్రకళ గర్భసంచి సమస్యతో నెల రోజుల క్రితం ఆసుపత్రి వైద్యులను సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా, రెండు రోజుల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరింది. గురువారం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
అయితే శుక్రవారం సాయంత్రం చంద్రకళ ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమకు తెలిసిన ఇతర వైద్యులను పిలిపించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసిందని బంధువులు పేర్కొన్నారు.
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రకళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రధాన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది చికిత్స చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Post a Comment