లేగ దూడను కాపాడబోయి తండ్రీకొడుకుల విషాద మృతి
గోవిందరావుపేట, మే 9: ములుగు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడిన లేగదూడను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కర్లపల్లి గ్రామానికి చెందిన రసపుత్ రాజు (45) ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో వారి లేగదూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. మూగజీవి ఆర్తనాదాలు విని చలించిపోయిన రాజు వెంటనే తాడుతో బావిలోకి దిగాడు. అప్పటికే లేగదూడ మృతి చెందగా, దానికి తాడు కట్టి పైకి పంపించాడు. రాజు పెద్ద కుమారుడు రసపుత్ పవన్ (24) లేగదూడను పైకి లాగాడు.
అయితే చాలాసేపటికీ తండ్రి బావి నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన పవన్ కూడా బావిలోకి దిగాడు. కానీ ఇద్దరూ తిరిగి పైకి రాకపోవడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. బావిలో విషవాయువులు ఉండి ఉంటాయని అనుమానించిన గ్రామస్తులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తండ్రీకొడుకులు మృతి చెందినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టించారు. అనంతరం మృతదేహాలను బావి నుంచి బయటకు తీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోగా, తండ్రీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Post a Comment