బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
హైదరాబాద్, మే 17: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మండే ఎండలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ ఎండలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇదే సమయంలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అయితే ఈ వర్షాల వల్ల పెద్దగా చల్లదనం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వర్షాల తర్వాత ఉక్కపోత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment