-->

మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య హత్య కేసు

 

మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య హత్య కేసు ప్రధాన నిందితురాలు కల్పన పుణెలో అదుపులోకి

హైదరాబాద్: మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న కల్పనను హైదరాబాద్ పోలీసులు పుణెలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కల్పన కొద్ది రోజులుగా వినయ్ రంజన్ రే ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన ఆమె, నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను రప్పించి దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో తనూజ నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో నిందితులు పరారయ్యారు.

ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాలతో 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు హత్య అనంతరం ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి రైలులో ముంబైకి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలు వారి కదలికలను అనుసరిస్తూ గాలింపు చేపట్టాయి.

దర్యాప్తులో భాగంగా పోలీసులు లక్నోలో కల్పన గతంలో పనిచేసిన ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారు. అక్కడ కూడా డబ్బులు, నగదు మాయమైన ఘటనలు జరిగినట్లు సమాచారం లభించినట్లు తెలిసింది. అదేవిధంగా నేపాల్‌కు చెందిన మరికొంతమంది మహిళలను విచారించగా, కల్పన తల్లిదండ్రులు పుణెలో ఉంటున్నట్లు సమాచారం బయటపడింది.

దీంతో పోలీసులు పుణెలోని ఆ ఇంటిపై నిఘా పెట్టి, అక్కడికి వచ్చిన కల్పనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక నేపాల్ ముఠా హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793