ఆల్కహాల్ టెస్టులపై ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన.. మంచిర్యాలలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్ల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధులకు హాజరయ్యే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ డ్రైవర్లు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు.
డ్రైవర్ రాయమల్లు మద్యం సేవించకపోయినా బ్రీత్ ఎనలైజర్ మిషన్ తప్పుగా పాజిటివ్ రిపోర్ట్ చూపించిందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. మరో డ్రైవర్ విషయంలో మొదటి పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పటికీ, రెండోసారి పరీక్షించగా నెగటివ్ రిపోర్ట్ రావడంతో మిషన్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, పైగా సస్పెన్షన్ బెదిరింపులు చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బస్సులు నడపబోమని డ్రైవర్లు స్పష్టం చేశారు.
డ్రైవర్ల నిరసనతో పలు బస్సులు డిపోల వద్దే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు.

Post a Comment