నీటిలో మునిగి బాలుడు సహా ఇద్దరు మృతి
మెదక్ జిల్లా, మే 07: మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లి కొట్టాల్‌లో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగిపోగా, అతడిని కాపాడేందుకు వెళ్లిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. చేగుంట మండలం వడియారానికి చెందిన నవదీప్(11) పిల్లి కొట్టాల్ శివారులోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడి పిల్లలతో కలిసి సమీపంలోని కుమ్మరి కుంట వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు.
ఈ క్రమంలో నవదీప్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతుండగా, అక్కడికి బహిర్భూమికి వచ్చిన పిల్లి కొట్టాల్‌కు చెందిన యాదగిరి(38) గమనించాడు. బాలుడిని రక్షించేందుకు యాదగిరి వెంటనే కుంటలోకి దూకాడు. అయితే దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.
అక్కడ ఉన్న ఇతర పిల్లలు గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలుడి మృతితో పాటు, ప్రాణాలకు తెగించి కాపాడేందుకు వెళ్లిన యాదగిరి కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెండు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు.

Post a Comment