-->

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు


పెద్దపల్లి, మే 06: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

బుధవారం మంథని మార్కెట్ యార్డును సందర్శించిన మంత్రి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, తడిసిన ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు లారీలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

రైతులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793