-->

ప్లీజ్ డాడీ… లే డాడీ!” – అకాల వర్షాల బారిన పడి నలుగురు రైతుల మృతి

ప్లీజ్ డాడీ… లే డాడీ! అకాల వర్షాల బారిన పడి నలుగురు రైతుల మృతి


మంచిర్యాల జిల్లా, మే 6: అకాల వర్షాలు రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పంటను కాపాడుకునేందుకు ప్రాణాలనే పణంగా పెట్టిన నలుగురు రైతులు దుర్మరణం చెందడం హృదయ విదారకంగా మారింది.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో, కల్లాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని రక్షించేందుకు సుమారు 15 మంది రైతులు వెళ్లారు. ఈ సమయంలో తీవ్ర ఈదురు గాలులు వీచడంతో కల్లాల సమీపంలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది.

ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గండరపు వెంకటేష్ (24), తనుగుల అభిరామ్ (22), నిల్కి లచ్చన్న (55), తనుగుల నాగరాజు (50)గా గుర్తించారు. మిగతా రైతులు గాయాలతో బయటపడ్డారు.

ఇక ఈ ఘటనతో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి. “ప్లీజ్ డాడీ… లే డాడీ!” అంటూ పిల్లలు విలపించిన దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి.

ఇదిలా ఉండగా, గత వారం రోజులుగా పంట కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఇప్పటికే 7 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణే ఈ మరణాలకు కారణమని తోటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793