అకాల వర్షానికి పంట కళ్లముందే తడిసి ముద్ద రైతుల కల్లాల్లో.. (క)నీరు
పెద్దపల్లి జిల్లా, మే 06: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం ఒకవైపు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించినా… మరోవైపు పెను విషాదాన్ని మిగిల్చింది. అకాల వర్షానికి పంటలను కాపాడుకునే క్రమంలో రైతులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా కలచివేసింది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసి ముద్ద కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కల్లాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం వర్షానికి తడిసి నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఈ విషాదం మరింత ముదిరింది. రాత్రి కురిసిన భారీ వర్షంలో పంటలను కాపాడేందుకు వెళ్లిన నలుగురు రైతులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మొన్నటివరకు ఎండల తీవ్రతతో అల్లాడిన తెలుగు రాష్ట్రాలు… ఇప్పుడు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పంట మొత్తం నీటిపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి వివేక్… రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
⚠️ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ ప్రకారం మే 8వ తేదీ వరకు నాగర్‌కర్నూల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అదేవిధంగా నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.
👉 అకాల వర్షాలు రైతుల జీవితాల్లో మిగిల్చిన ఈ విషాదం… తక్షణ సహాయం, సరైన మద్దతు ఎంత అవసరమో మరోసారి గుర్తుచేస్తోంది.

Post a Comment