-->

సూటిపోటి మాటలు.. వేధింపులు? డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ అధికారి వింత పోకడలు..!

సూటిపోటి మాటలు.. వేధింపులు? డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ అధికారి వింత పోకడలు..!

ఖమ్మం: వైద్య ఆరోగ్యశాఖలో ఓ అధికారి వ్యవహార శైలి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాక్టర్లకు మార్గనిర్దేశం చేయాల్సిన డివిజనల్ అధికారి, తోటి వైద్యులను సూటిపోటి మాటలతో మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ అధికారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో హోదాలో ఉండి మహిళా వైద్యులతో అనుచితంగా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సమాచారం ప్రకారం, ఖమ్మం డివిజన్ పరిధిలోని 14 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యులు, ముఖ్యంగా మహిళా డాక్టర్లకు తరచూ ఫోన్లు చేస్తూ గంటల తరబడి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. విధులకు సంబంధం లేని వ్యక్తిగత వ్యాఖ్యలు, డబుల్ మీనింగ్ మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఫోన్ వస్తుందంటేనే వైద్యులు భయపడే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు.

మహిళా డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు?

మహిళా వైద్యాధికారులు సెలవు కోరితే, “నువ్వు సెలవు పెడితే నాకు రాత్రి నిద్ర పట్టలేదు” వంటి వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని సమాచారం. అంతేకాకుండా, “ఆఫీసుకు రండి.. కూర్చొని మాట్లాడదాం” అంటూ అనవసర ఒత్తిళ్లు తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తరహా ప్రవర్తనతో మహిళా సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

విధుల కంటే వివాదాలకే ప్రాధాన్యం?

సదరు అధికారి ప్రభుత్వ పనుల కంటే ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పై అధికారులు అప్పగించే కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించకుండా వివాదాలకు దారి తీసేలా వ్యవహరిస్తున్నారని శాఖలో చర్చ జరుగుతోంది. కార్యాలయంలో ఉన్నప్పటికీ సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ ఒత్తిడులకు గురిచేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది విధులు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం?

డిప్యూటీ డీఎంహెచ్‌వో వ్యవహారంపై డాక్టర్ అసోసియేషన్ కూడా సీరియస్‌గా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ పీహెచ్‌సీలలో పనిచేస్తున్న మహిళా వైద్యులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సూటిపోటి మాటలు, అనవసర ఫోన్లు, మానసిక వేధింపులపై కలెక్టర్‌కు అధికారిక ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793