దొమ్మర, పిచ్చకుంట్ల కులాలకు అవమానాల నుంచి విముక్తి
హైదరాబాద్, మే 08: తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న కొన్ని కులాల పేర్లపై చాలా కాలంగా కొనసాగుతున్న ఆవేదనకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపించింది. అవమానకరంగా భావిస్తున్న కుల పేర్లను మార్చాలని దశాబ్దాలుగా కోరుతున్న దొమ్మర, పిచ్చకుంట్ల వర్గాల అభ్యర్థనలను ప్రభుత్వం ఆమోదించింది.
రాష్ట్ర బీసీ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా:
- “దొమ్మర” కులం పేరును “గడ వంశీయ”గా మార్చారు.
- “పిచ్చకుంట్ల” అనే పేరును తొలగించి “వంశ రాజ్”గా మార్పు చేశారు.
- “శూద్ర కులం” అనే పదాన్ని తొలగించి “తమ్మలి (బ్రాహ్మణేతర)”గా సవరించారు.
ఇప్పటి వరకు తమ కులం పేరును చెప్పుకోవడానికే సంకోచించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నామని, సమాజంలో అవమానాలను భరించాల్సి వచ్చిందని ఆయా వర్గాల ప్రజలు పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని వారు పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే దిశగా ముందడుగు వేసిందని సంబంధిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కులాల పేర్ల మార్పు ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుందని, భవిష్యత్తులో అధికారిక పత్రాల్లో కూడా కొత్త పేర్లే అమలులోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Post a Comment