అర్థరాత్రి తండ్రి ఫోన్.. కాచిగూడ పోలీసులు కాపాడిన యువకుడి ప్రాణం
హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీసుల అప్రమత్తతతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అర్థరాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించిన పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలను కాపాడారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన నిరంజన్ అనే యువకుడు కర్నూల్‌లోని జయరాజ్ స్టీల్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతడు మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని రైలు పట్టాలపై నిలబడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వీడియో క్లిప్‌ను తన తండ్రి నాగారాజుకు పంపించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నాగారాజు అర్థరాత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ యుగంధర్‌కు ఫోన్ చేసి తన కుమారుడిని కాపాడాలని వేడుకున్నాడు.
వెంటనే స్పందించిన యుగంధర్ తన సిబ్బందితో కలిసి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో రైల్వే పోలీసులకు కూడా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్ సిబ్బంది స్టేషన్ పరిసరాల్లో వేగంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ప్లాట్‌ఫారమ్ నంబర్ 5 వద్ద రైలు పట్టాలపై ఉన్న నిరంజన్‌ను పోలీసులు గుర్తించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది, రైల్వే పోలీసుల సహాయంతో యువకుడిని వెంటనే పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అనంతరం నిరంజన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ అందించారు. సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన బ్లూ కోల్ట్ సిబ్బందిని ఎస్‌హెచ్‌వో రాజశేఖర్ అభినందించారు.

Post a Comment