భద్రాద్రి జిల్లా రైతు వేదికలో జోరుగా రైతు వారోత్సవాలు
కొత్తగూడెం: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తగూడెం రైతు వేదికలో సోమవారం రైతు వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు హాజరై రైతులతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి రెవెన్యూ గ్రామానికి సాయిల్ వాలంటీర్లను నియమించడం ద్వారా రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల ఆధారంగా రైతులకు భూసార కార్డులు అందించి, నేలలో పోషక లోపాలను గుర్తించి సరైన చర్యలు తీసుకునే అవకాశముంటుందని చెప్పారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ మరియు జీవ ఎరువుల వైపు దృష్టి మళ్లించాలని రైతులకు సూచించారు. సహజసిద్ధమైన వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు మెరుగవుతాయని వివరించారు. ఎరువులను సరైన మోతాదులో, సరైన సమయంలో వినియోగిస్తే తెగుళ్లు, పురుగుల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు.
అలాగే అవసరానికి మించి ఒకేసారి ఎరువులు వేయకుండా విడతల వారీగా వాడడం వల్ల పంటలు సమతుల్యంగా పెరుగుతాయని సూచించారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, పోషకాల సమతుల్యత, సూక్ష్మ పోషకాల లోపాల గుర్తింపు వంటి అంశాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment