రాజధాని ఎక్స్ప్రెస్ లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను విషాదం
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న Rajdhani Express రైలులోని బి-1 ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ బలగాలు అప్రమత్తంగా స్పందించడంతో 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆదివారం ఉదయం సుమారు 5:15 నుంచి 5:30 గంటల మధ్య కోటా రైల్వే డివిజన్ పరిధిలోని లూని రిచా – విక్రమ్‌గఢ్ ఆలోట్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌కు సమీపంలోని బి-1 ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బోగీ అంతటా వ్యాపించాయి.
బోగీలో 68 మంది ప్రయాణికులు
రైలు గార్డ్ మంటలను గుర్తించి వెంటనే లోకో పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో రైలును అత్యవసరంగా నిలిపివేశారు. ఆ సమయంలో బోగీలో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రైలులో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది, రైల్వే ఉద్యోగులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి కేవలం 15 నిమిషాల్లో బోగీని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.
ప్రమాదం అనంతరం అధికారులు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మంటలు అంటుకున్న బి-1 బోగీని రైలు నుంచి వేరు చేశారు.
కోటా వరకు ప్రయాణికుల తరలింపు
అగ్నిప్రమాదానికి గురైన బోగీలోని ప్రయాణికులను ఇతర కోచ్‌లలో సర్దుబాటు చేసి కోటా వరకు తరలించారు. అనంతరం కోటా స్టేషన్‌లో అదనపు బోగీ అమర్చి రైలును తిరిగి గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన కారణంగా ఢిల్లీ–ముంబై ప్రధాన రైల్వే మార్గంలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోవడంతో పలు రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి.
నిలిచిపోయిన రైళ్ల వివరాలు
- ట్రెయిన్ 12955 – మహీద్పూర్ రోడ్ స్టేషన్
- ట్రెయిన్ 19020 – శామ్‌గఢ్ స్టేషన్
- ట్రెయిన్ 12416 – సువాస్ర స్టేషన్
- ట్రెయిన్ 12472 (స్వరాజ్ ఎక్స్‌ప్రెస్) – శామ్‌గఢ్ స్టేషన్
- ట్రెయిన్ 22210 – చౌమహ్లా స్టేషన్
- ట్రెయిన్ 01492 (పుణే స్పెషల్) – మోదక్ స్టేషన్
- ట్రెయిన్ 05017 – నాథూ ఖేడీ స్టేషన్
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా? లేక మరే ఇతర కారణమా? అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment