-->

సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి.. మేడిపల్లిలో విషాదం

సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి.. మేడిపల్లిలో విషాదం


మేడిపల్లి : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటలాడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు నీటితో నిండిన సంపులో పడి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు జిల్లా కందుకూర్ మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన జూపల్లి మహేందర్ కుటుంబంతో కలిసి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు ధరణి కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద కూలి పనులు చేస్తున్నారు. వీరికి మహేష్(5) అనే కుమారుడు ఉన్నాడు.

శుక్రవారం తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా, బాలుడు సమీపంలో ఆటలాడుకుంటూ వెళ్లాడు. అక్కడ నిర్మాణ ప్రదేశంలో నీటితో నిండిన సంపుకు మూత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. కొంతసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనగా వెతకడం ప్రారంభించారు. అనంతరం సంపులో బాలుడు కనిపించడంతో వెంటనే బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు.

కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిర్మాణ ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా సంపును తెరిచి ఉంచడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793