మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణకు సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణకు సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 26: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. "మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం" సందర్భంగా విడుదల చేసిన సందేశంలో యువతలో సానుకూల ఆలోచనలు, విలువలు పెంపొందించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.
మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన, అప్రమత్తత, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని సీఎం స్పష్టం చేశారు.
"డ్రగ్ ఫ్రీ తెలంగాణ" లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత తమ భవిష్యత్తును మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Post a Comment