బద్వేల్‌లో విషాదం.. చేపల వేటకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి
బద్వేల్‌లో విషాదం.. చేపల వేటకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి
కడప జిల్లా బద్వేల్ రూరల్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఇండ్ల నాగార్జున అనే వ్యక్తి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోవడంతో మృతి చెందినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం, నాగార్జున చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో అతనితో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. చేపల వేటలో నిమగ్నమైన సమయంలో ప్రమాదవశాత్తు ఆయన బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. కొంతసేపు గడిచినా నాగార్జున బయటకు రాకపోవడంతో వెంట ఉన్న చిన్నారులు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే భయాందోళనలకు గురైన వారు కొంతసేపు ఈ సమాచారాన్ని బయటకు వెల్లడించలేదని సమాచారం.
తర్వాత ఈ విషయం బద్వేల్ రూరల్ పోలీసులకు చేరడంతో పోలీసులు, స్థానికుల సహకారంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం నాగార్జున మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, ఇదే బావి గతంలో కూడా ఓ విషాద ఘటనకు కేంద్రబిందువైంది. కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను ఈ బావిలోకి తోసివేయడంతో వారు మృతి చెందిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా మరో ప్రాణం అదే బావిలో బలికావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ బావికి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Post a Comment