-->

జూబ్లీహిల్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మకస్తుడే రూ.1.60 కోట్ల బంగారం కొట్టేశాడు..!

 

జూబ్లీహిల్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మకస్తుడే రూ.1.60 కోట్ల బంగారం కొట్టేశాడు..!

జూబ్లీహిల్స్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మకస్తుడే రూ.1.60 కోట్ల బంగారం కొట్టేశాడు..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన భారీ బంగారం చోరీ కేసులో సంచలన విషయం బయటపడింది. యజమాని నమ్మకాన్ని సంపాదించిన ఉద్యోగే తన తమ్ముడి సాయంతో రూ.1.60 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 1.029 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన హరీశ్, ఆకాశ్ అన్నదమ్ములు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మంగళ్‌హాట్‌లో నివాసం ఉంటున్నారు. ఆకాశ్ హైటెక్ సిటీలోని ఓ ఐటీ సంస్థలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తుండగా, హరీశ్ 2023 నుంచి గురుకృప ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

సంస్థ తయారు చేసే బంగారు, వజ్రాభరణాల నమూనాలను ప్రముఖ నగల దుకాణాలకు తీసుకెళ్లడం, ఆర్డర్లు తీసుకురావడం, ఖరీదైన ఆభరణాలు, చెక్కులను భద్రంగా తీసుకురావడం ద్వారా హరీశ్ యజమాని పూర్తి నమ్మకాన్ని సంపాదించాడు.

అయితే ఇటీవల ఇంటి నిర్మాణం, వివాహం కారణంగా హరీశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. నెల జీతంతో కుటుంబ ఖర్చులు, అప్పులు తీర్చలేక చోరీకి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ కుట్రలో అతడి తమ్ముడు ఆకాశ్ కూడా సహకరించాడు.

సంస్థ మేనేజర్ ముంబై వెళ్లిన సమయంలో అవకాశాన్ని ఉపయోగించుకున్న హరీశ్.. రాత్రి సమయంలో బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి దుకాణంలోకి ప్రవేశించాడు. అనంతరం లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి వాటిని ఆకాశ్‌కు అప్పగించాడు.

దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ బృందం ఇద్దరినీ అరెస్టు చేసి రూ.1.60 కోట్ల విలువైన 1.029 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793