వర్షాల కోసం 'సలాత్ అల్-ఇస్తిస్కా'కు ఒవైసీ పిలుపు.. తెలంగాణ వ్యాప్తంగా జూలై 26న ప్రత్యేక ప్రార్థనలు
వర్షాల కోసం 'సలాత్ అల్-ఇస్తిస్కా'కు ఒవైసీ పిలుపు.. తెలంగాణ వ్యాప్తంగా జూలై 26న ప్రత్యేక ప్రార్థనలు
హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటలకు వర్షాల కోసం ఇస్లామిక్ సంప్రదాయమైన 'సలాత్ అల్-ఇస్తిస్కా' ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో వర్షాలు కురవడం లేదని ఒవైసీ తెలిపారు. తెలంగాణలో సుమారు 20 జిల్లాల్లో సగటుతో పోలిస్తే 19 శాతం వర్షపాతం లోటు నమోదైందని, పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉర్దూ మీడియం నిరుపేద విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కరవు పరిస్థితులు తొలగిపోయి ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సమాజానికి చెందిన ప్రజలతో పాటు సమాజ హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆధ్యాత్మిక మార్గంగా ఈ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా విద్యకు సంబంధించిన అంశాలపై కూడా ఒవైసీ మాట్లాడారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మజ్లిస్ ఛారిటీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యా కిట్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 11 వేల మంది ఉర్దూ మీడియం విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా ముస్లిం బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యను మధ్యలోనే నిలిపివేయవద్దని ఒవైసీ సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఉన్నత విద్యను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా కుటుంబాలతో పాటు సమాజం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment