నిర్మా పౌడర్‌తో కల్తీ పాలు.. ఆరు నెలల్లో రూ.9.21 కోట్ల సింథటిక్ పాల విక్రయం!
నిర్మా పౌడర్‌తో కల్తీ పాలు.. ఆరు నెలల్లో రూ.9.21 కోట్ల సింథటిక్ పాల విక్రయం!
మహారాష్ట్రలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టు రట్టైంది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో నిర్వహించిన దాడుల్లో భారీ స్థాయిలో సింథటిక్ పాలు తయారు చేసి విక్రయిస్తున్న రాకెట్‌ను అధికారులు వెలికితీశారు.
దర్యాప్తులో భాగంగా కేవలం ఆరు నెలల వ్యవధిలో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడిని ఉపయోగించి సుమారు 2.3 కోట్ల లీటర్ల సింథటిక్ పాలను తయారు చేసినట్లు గుర్తించారు. ఈ పాల విక్రయాల విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
అధికారుల వివరాల ప్రకారం, ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలను కలిపి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కల్తీ పాలను తయారు చేయడానికి నిర్మా డిటర్జెంట్ పౌడర్, పామాయిల్‌తో పాటు నాసిరకం రసాయనాలను ఉపయోగించినట్లు విచారణలో తేలింది.
ఈ ఘటనపై మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. అయితే నిందితులంతా ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన ఈ ఘటనపై అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పాల ఉత్పత్తులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Post a Comment