చేతబడి ఆరోపణలు.. అఘోరితో పాటు 7 మంది అరెస్ట్
కర్ణాటకలో చేతబడి ఆరోపణలు.. అఘోరితో పాటు 7 మంది అరెస్ట్
కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా సరిహద్దు ప్రాంతమైన కంగాండ్లహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఐవారహళ్లి గ్రామంలో ఉన్న బేతాళ మహాశక్తి పీఠ దేవాలయంలో చేతబడి, క్షుద్రపూజలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శివాంశు రాజ్‌పుత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
దేవాలయంలోని అమ్మవారి, భేతాళ విగ్రహాలను పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఆలయంలో చేతబడి జరుగుతోందంటూ తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. విచారణలో భాగంగా క్షుద్రపూజలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని, కర్ణాటక మూఢనమ్మకాల ప్రతిబంధక చట్టం కింద అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
మహిళలను అక్రమంగా నిర్బంధించడం, వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. గ్రామంలో ఇలాంటి క్షుద్రపూజలు, చేతబడులను పూర్తిగా అడ్డుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ కేసులో చేతబడి నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న అఘోరి చంద్రనాథ్‌తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ లక్ష్మయ్య, బేతమంగల సీఐ జగదీష్, ఎస్‌ఐ సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment