సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు.. హెచ్‌ఎంఎస్–టీఆర్‌ఎస్ పోరాట ఫలితమే: కోడిపల్లి శ్రీలత
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు.. హెచ్‌ఎంఎస్–టీఆర్‌ఎస్ పోరాట ఫలితమే: కోడిపల్లి శ్రీలత
మణుగూరు: సింగరేణి కార్మికుల కోసం హెచ్‌ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన (TRS) గాంధేయ మార్గంలో చేసిన పోరాటం ఫలితంగానే సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని హెచ్‌ఎంఎస్ మణుగూరు ఏరియా యూనియన్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత అన్నారు.
ఆమె మాట్లాడుతూ, నెలల తరబడి మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఎస్–టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన "బాయి బాట" కార్యక్రమంలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే ఈ నెల 20 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించామని తెలిపారు.
ఆ పిలుపుకు అనుగుణంగా దీక్షకు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి ఈ నెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించాలని నిర్ణయించడం హెచ్‌ఎంఎస్–టీఆర్‌ఎస్ పోరాట విజయమే కాకుండా సింగరేణి కార్మికుల విజయమని ఆమె పేర్కొన్నారు.
వేలాది మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, కార్మికుల వారసత్వ ఉద్యోగాలు వారి హక్కు అని శ్రీలత స్పష్టం చేశారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి, అర్హులైన ప్రతి కార్మికుడిని పరిశీలించి, బోర్డు సూచించిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించకపోతే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం హెచ్‌ఎంఎస్–టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం హెచ్‌ఎంఎస్ ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తుందని ఆమె అన్నారు.

Post a Comment