-->

ప్రేమించిన యువతికి వేరే పెళ్లి.. ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు.. ఆరుగురు అరెస్ట్

 

ప్రేమించిన యువతికి వేరే పెళ్లి.. ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు.. ఆరుగురు అరెస్ట్

ప్రేమించిన యువతికి వేరే పెళ్లి.. ఊరంతా పోస్టర్లు అంటించిన ప్రియుడు.. ఆరుగురు అరెస్ట్

సిద్దిపేట, జూలై 10: తాను ప్రేమించిన యువతికి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించడంతో ఆ పెళ్లిని అడ్డుకునేందుకు ఓ యువకుడు అభ్యంతరకర పోస్టర్లు ముద్రించి రెండు గ్రామాల్లో అంటించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ (29) అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో ఆమె వివాహాన్ని నిశ్చయించారు.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేష్, పెళ్లి ఆగిపోవాలనే ఉద్దేశంతో యువతితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు చూపించేలా అభ్యంతరకర పోస్టర్లు రూపొందించాడు. అనంతరం యువతి స్వగ్రామంతో పాటు ఆమెను వివాహం చేసుకోబోతున్న యువకుడి గ్రామంలోనూ ఆ పోస్టర్లను అతికించాడు.

పోస్టర్లు వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబ సభ్యులు సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్‌తో పాటు అతనికి సహకరించిన వన్నెల అశ్విత్‌కుమార్, బండి భానుప్రసాద్, రేఖ, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్‌కుమార్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793