కేటీపీఎస్, బీటీపీఎస్‌లలో 15వ రోజుకు చేరిన నిరసనలు
పాల్వంచ/మణుగూరు టౌన్, జూలై 9: నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని కోల్, యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు కేటీపీఎస్, బీటీపీఎస్‌లలో కొనసాగుతున్న నిరసనలు గురువారం 15వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా పాల్వంచ అంబేద్కర్ సెంటర్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి, విద్యుత్ యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలాగే మణుగూరు బీటీపీఎస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టి విద్యుత్ యాజమాన్యాల మొండి వైఖరిని ఖండించారు.
ఈ సందర్భంగా జేఏసీ బీటీపీఎస్ రీజినల్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్‌లో అమలు చేయాలని చూస్తున్న పాక్షిక ప్రైవేటీకరణ విధానం భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీటీపీఎస్‌కు ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యాలు వెంటనే ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో జేఏసీ చైర్మన్ రాజేందర్, యస్మిన్, ఉమామహేశ్వరరావు, బ్రహ్మాజీ, రాజేశ్, మహేశ్, రఘువీర్, డోలి శ్రీనివాసరావు, రాధాకృష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, సీతారామిరెడ్డి, తిరుపతి, వెంకటేశ్వర్లు, నరసింహారావు, సయ్యద్, భాగ్యరాజు, పావని, లక్ష్మి, రిజ్వాన, రవిప్రసాద్, నవీన్, ప్రసాద్, సత్యనారాయణ, శోభన్, వరుణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment