హిజ్రాలు యువకుడిపై కత్తులతో దాడి కూకట్‌పల్లిలో కలకలం
హిజ్రాలు యువకుడిపై కత్తులతో దాడి కూకట్‌పల్లిలో కలకలం
హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హిజ్రాలు, వారి వెంట ఉన్న కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కొందరు హిజ్రాలు అడ్డగించి డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై యువకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం హిజ్రాలతో పాటు ఉన్న మరికొందరు వ్యక్తులు యువకుడిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో యువకుడికి భుజం, చేతిపై గాయాలయ్యాయి. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగెత్తిన బాధితుడు, దుండగులు వెంబడించడంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి ఆశ్రయం పొందినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment