జలపాతంలో పడి యువకుడు మృతి.. ములుగు జిల్లాలో విషాదం
జలపాతంలో పడి యువకుడు మృతి.. ములుగు జిల్లాలో విషాదం
ములుగు, జూలై 20: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుండం జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో ఈతకు దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం అరుణాచలపురం గ్రామ సమీపంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అక్బర్, ఇలియాస్, అన్వర్, సయ్యద్ అక్తరుద్దీన్ (26) ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం రెండు బైక్‌లపై ములుగు జిల్లాలోని జలపాతాలను సందర్శించేందుకు వాజేడు మండలానికి వచ్చారు.
మొదట బొగత జలపాతానికి వెళ్లగా, అక్కడ పర్యాటకులకు అనుమతి లేకపోవడంతో దూలపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అరుణాచలపురం సమీపంలోని గుండం జలపాతం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు ఫొటోలు దిగిన అనంతరం నీటిలోకి దిగగా, సయ్యద్ అక్తరుద్దీన్ ప్రమాదవశాత్తు లోతైన నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
అతని స్నేహితులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది అక్తరుద్దీన్‌ను బయటకు తీసి సీపీఆర్ నిర్వహించారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారికి తీసుకువచ్చి, అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు ఎస్సై సతీశ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) నరేందర్ మాట్లాడుతూ, వాజేడు మండలంలో అధికారికంగా బొగత జలపాతం వద్ద మాత్రమే పర్యాటకులకు అనుమతి ఉందని, అనుమతి లేని జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పర్యాటకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Post a Comment