పోలీస్ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా నిర్వహిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
పోలీస్ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా నిర్వహిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, జులై 19: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ ట్రైనింగ్, కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పనితీరు, కొనసాగుతున్న నియామకాల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క ప్రశ్నాపత్రం కూడా లీక్ కాకపోవడం బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. పోలీస్ నియామకాలలో పారదర్శకతకు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
సీసీటీఎన్‌ఎస్ (CCTNS) జాతీయ స్థాయి ప్రమాణాలను చేరుకోవాలంటే అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. కొత్త సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ, అన్ని డిజిటల్ యాప్‌లను సమర్థవంతంగా ఉపయోగించాలని ఆదేశించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించాలన్నారు.
2022–23లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ నియామక ప్రక్రియ ద్వారా 16,654 పోస్టులు భర్తీ చేసినట్లు డీజీపీ వెల్లడించారు. వాటిలో 95 శాతం కానిస్టేబుల్ పోస్టులు, 5 శాతం ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం 2025 నోటిఫికేషన్ల కింద 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, 1,743 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తొలిసారిగా నిర్వహించిన ఫింగర్‌ప్రింట్ అండ్ ఫోరెన్సిక్ విభాగ నియామకాలలో 60 పోస్టులకు 57 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో 33 శాతం మహిళా రిజర్వేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ, మొబైల్, ఈ-మెయిల్ రిజిస్ట్రేషన్, నెగెటివ్ మార్కింగ్ వంటి సంస్కరణలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
సమావేశంలో పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ ఆధునికీకరణపై పలు కీలక సూచనలు చేసిన డీజీపీ సీవీ ఆనంద్, నూతన కమ్యూనికేషన్ సెట్లను ఆవిష్కరించారు.

Post a Comment