ప్రేమ వేధింపుల నేపథ్యంలో ఇద్దరి అనుమానాస్పద మృతి.. నల్లగొండలో కలకలం
ప్రేమ వేధింపుల నేపథ్యంలో ఇద్దరి అనుమానాస్పద మృతి.. నల్లగొండలో కలకలం
నల్లగొండ, జులై 18: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రిపరేషన్ సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆమె ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఇంటికి వచ్చిన ఆమె సోదరి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు విద్యార్థిని ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ కూడా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు.
శుక్రవారం సాయంత్రం చరణ్ మరో వ్యక్తితో కలిసి యువతి ఇంటికి వెళ్లి వచ్చిన అనంతరమే ఈ రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై ఏదైనా బలవంతం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మృతురాలి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment