-->

సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ డిమాండ్

సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ డిమాండ్

 సింగరేణి మెడికల్ బోర్డు పరీక్షలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి: హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ డిమాండ్

కొత్తగూడెం: సింగరేణి సంస్థలో నిర్వహిస్తున్న మెడికల్ బోర్డు పరీక్షలకు కార్మికులకు తగినంత ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కేవలం ఒక రోజు ముందే హాజరుకావాలని తెలియజేయడం అన్యాయమని హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ విమర్శించారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోటీ పరీక్షలకైనా అభ్యర్థులకు కనీసం 15 రోజుల ముందుగానే సమాచారం అందజేస్తారని, కానీ సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఒక్కరోజు ముందే సమాచారం ఇవ్వడం సమంజసం కాదని అన్నారు.

చాలా మంది కార్మికులు విధులకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉండడం, వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడం వంటి కారణాలతో ఒక రోజు వ్యవధిలో హాజరుకావడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెల్ఫేర్ అధికారులు అకస్మాత్తుగా ఫోన్ చేసి లేదా సమాచారం ఇచ్చి మరుసటి రోజే హాజరుకావాలని చెప్పడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలకు 28 మంది కార్మికులు గైర్హాజరయ్యారని రియాజ్ అహ్మద్ తెలిపారు. వారి గైర్హాజరును కారణంగా చూపి అవకాశాన్ని కోల్పోయేలా చేయకుండా, వారికి మరోసారి మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మెడికల్ బోర్డు పరీక్షల తేదీలను కనీసం 15 రోజుల ముందుగానే అధికారికంగా ప్రకటించి, ప్రతి కార్మికుడికి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికుల హక్కులను కాపాడే విధంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793