-->

విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

 

విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

హైదరాబాద్, జూలై 25: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా సంస్థల యాజమాన్యం కూడా బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అమలు చేస్తున్న చర్యలను మరింత కఠినతరం చేయాలని, అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల పనితీరుపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో యాజమాన్యాల పాత్ర అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. క్యాంపస్‌లోనే కాకుండా బయట జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను కూడా గుర్తించి అధికారులకు సమాచారం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ముందుగానే గుర్తించేందుకు ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిరోధంలో విద్యా సంస్థలకు అధికారాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగించాలని ఆయన అన్నారు.

అదేవిధంగా, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి విద్యా సంస్థలో టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్ నిర్మూలనలో గుర్తించడం – వ్యసనాన్ని మాన్పించడం – శిక్షించడం అనే మూడు దశల్లో సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించి కౌన్సిలింగ్ అందించాలని, అదే తప్పిదాన్ని పదేపదే చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధానాన్ని రూపొందించాలని చెప్పారు.

ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793