ఆలయాల్లో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
ఆలయాల్లో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
పెద్దపల్లి, జులై 25: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు అర్చనలు, విఠలేశ్వర స్వామివారికి మహాపూజను వైభవంగా నిర్వహించారు.
ఇక మంథని సమీపంలోని గోదావరి నది తీరంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు. తొలి ఏకాదశి పర్వదినంతో గోదావరి తీరం, ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడగా, మంథని పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంథని మున్సిపాలిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారు.

Post a Comment