చుంచుపల్లి పంచాయతీ నిర్లక్ష్యం.. చెత్త దహనంతో ప్రజల ఆరోగ్యంపై ముప్పు
చుంచుపల్లి పంచాయతీ నిర్లక్ష్యం.. చెత్త దహనంతో ప్రజల ఆరోగ్యంపై ముప్పు
చుంచుపల్లి: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ చుంచుపల్లి గ్రామ పంచాయతీ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుక్యాంప్ వైకుంఠధామం వద్ద ప్రతిరోజూ చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను బహిరంగంగా తగలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం, దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం, చెత్తను దహనం చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్, CMPF కార్యాలయం, ఒక పాఠశాల, ఐటీఐ కళాశాల ఉన్నాయి. అలాగే గోదుమవాగు పరిసరాల్లో వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గోధుమ వాగు హైవే రోడ్డుపై వేలాది వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు అట్టి పొగ కండ్లలో పడి ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ చెత్తను కాల్చడం వల్ల వెలువడుతున్న పొగ, విష వాయువుల కారణంగా విద్యార్థులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త దహనం వల్ల విద్యార్థులకు కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం జరుగుతోందని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడం కాలుష్య నియంత్రణ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటున్నారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు స్థానికులు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెత్తను శాస్త్రీయ విధానంలో నిర్వహించాలని, బహిరంగంగా వ్యర్థాలను తగలబెట్టే చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు కోరుతున్నారు.

Post a Comment