హైదరాబాద్‌లో ఆరుగురి హత్యలు కలకలం.. సీఎం రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్‌లో ఆరుగురి హత్యలు కలకలం.. సీఎం రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్
హైదరాబాద్, జూలై 11: హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆరుగురి హత్యల ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపించారు. అనంతరం బాలిక తల్లి, నాన్నమ్మను కిరాతకంగా హత్య చేశాడని, మరో ఘటనలో తన భార్య, పిల్లలను కూడా హతమార్చాడని పేర్కొన్నారు.
ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నప్పటికీ నిఘా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం నిందితుడిని అడ్డుకోలేకపోవడం అత్యంత బాధాకరమని కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఇంతటి క్రూర నేరప్రవృత్తి కలిగిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు చెప్పడం సరైన సమాధానం కాదని, అతడిని తక్షణమే అదుపులోకి తీసుకుని చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఆరుగురి హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Post a Comment