రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య భద్రత.. 'న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్' ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య భద్రత.. 'న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్' ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం **'న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)'**ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లుతో పాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 886 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇన్‌పేషెంట్ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) పరిధిలోని 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలకు పూర్తి కవరేజ్ ఈ పథకంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు.
పథకం పారదర్శకంగా అమలయ్యేలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమాన భాగస్వామ్యంతో ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన కారణంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.10 వేల కోట్ల వైద్య బిల్లులను కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో క్లియర్ చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.
ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని, వారు వైద్య ఖర్చుల కోసం అప్పులపాలు కాకూడదనే మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment