సింగరేణి పరిరక్షణకు కేంద్రం జోక్యం చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టిబీజీకేఎస్ వినతి
సింగరేణి పరిరక్షణకు కేంద్రం జోక్యం చేసుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టిబీజీకేఎస్ వినతి
హైదరాబాద్, జూలై 10: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రయోజనాలను పరిరక్షించి, సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికు వినతిపత్రం సమర్పించారు.
సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, సంస్థ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పదేళ్లుగా గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు సింగరేణి పురోగతిలో టిబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు ఇవే...
శ్రావణపల్లి, కేకే-6 అండర్‌గ్రౌండ్ మైన్, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌లతో పాటు వేలానికి సిద్ధంగా ఉన్న అన్ని బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు కాకుండా సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన కోయగూడెం-III, సత్తుపల్లి-III బొగ్గు బ్లాక్‌ల కేటాయింపును రద్దు చేసి, వాటిని తిరిగి సింగరేణి సంస్థకే అప్పగించాలని కోరారు.
సింగరేణి చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ప్రాధాన్యతతో పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు.
తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.57 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కమిటీ నిర్వహించిన సైట్ విజిట్ నివేదికతో పాటు సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై జరిగిన విచారణ నివేదికలను బహిర్గతం చేసి, అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతీయ బొగ్గు వేతన ఒప్పందం (NCWA) కోసం వేతన కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి, కార్మికులకు కొత్త వేతన ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులను వేలం ప్రక్రియ లేకుండానే సింగరేణికి కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో బొగ్గు ఉత్పత్తి, నిల్వల గణాంకాలు, పన్నుల చెల్లింపుల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సింగరేణిలో కార్మిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
టిబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ భవిష్యత్తు, వేలాది మంది కార్మికుల ఉపాధి, సంస్థ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ వినతిపత్రంలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. సింగరేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సంస్థ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment