హైదరాబాద్‌లో 100 ఎకరాల్లో కొత్త టీజీఎస్‌ఆర్టీసీ డిపో.. గాజుల రామారంలో ఏర్పాటు
హైదరాబాద్‌లో 100 ఎకరాల్లో కొత్త టీజీఎస్‌ఆర్టీసీ డిపో.. గాజుల రామారంలో ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 7: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న బస్సుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీకి మరో భారీ బస్ డిపో ఏర్పాటు కానుంది. జగద్గిరిగుట్ట సమీపంలోని కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జగద్గిరిగుట్ట మీదుగా ప్రతిరోజూ 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు కలిపి మొత్తం 404 ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హెచ్‌ఎంటీ స్థలం లీజుపై ప్రతిష్ఠంభన
మొదట టీజీఎస్‌ఆర్టీసీ బస్ డిపో, టెర్మినల్ నిర్మాణం కోసం హెచ్‌ఎంటీకి చెందిన స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు తీసుకునే ప్రతిపాదనను పరిశీలించినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హెచ్‌ఎంటీ అధికారులు 99 ఏళ్ల లీజుకు అంగీకరించకుండా, 5 ఏళ్ల చొప్పున గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు మాత్రమే లీజు ఇవ్వగలమని, అందుకు ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని సూచించినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను టీజీఎస్‌ఆర్టీసీ అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయంగా గాజుల రామారంలో 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు వివరించారు.
ఆధునిక సౌకర్యాలతో భారీ డిపో
గాజుల రామారంలో నిర్మించనున్న ఈ డిపోలో ఇంటర్‌స్టేట్ బస్సుల కోసం ప్రత్యేక బస్ టెర్మినల్, నగర బస్సుల కోసం మరో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల కోసం అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలకు చెక్
ఇతర రాష్ట్రాలు, తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులను ఈ కొత్త డిపోకు మళ్లించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Post a Comment