ఇండియన్ బ్యాంకులో గోల్డ్ గోల్‌మాల్.. 22 మంది ఖాతాదారుల బంగారం మాయం
ఇండియన్ బ్యాంకులో గోల్డ్ గోల్‌మాల్.. 22 మంది ఖాతాదారుల బంగారం మాయం
తాకట్టు పెట్టిన రూ.91 లక్షల విలువైన 700 గ్రాముల బంగారం గల్లంతు
అసిస్టెంట్ మేనేజర్‌పై పోలీసులకు ఫిర్యాదు.. బ్యాంకు వద్దకు క్యూ కట్టిన బాధితులు
మహబూబాబాద్, ఆగస్టు 14: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో భారీగా బంగారు ఆభరణాలు గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంకులో తాకట్టు పెట్టిన 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు రూ.91 లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న భూక్య రాజేష్ పలుదఫాలుగా ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను బ్యాంకు నుంచి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిలో 16 మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలను మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి చెందిన బంగారు ఆభరణాల ప్యాకెట్లు ఇంట్లో ఉండగా, వాటిని ఆయన భార్య తీసుకొచ్చి బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
ఆడిట్‌లో బయటపడిన గోల్‌మాల్
బ్యాంకు మేనేజర్ బాదావత్ మోతిలాల్ ప్రతి నెలా బ్యాంకులోని నగదు, బంగారు ఆభరణాల ప్యాకెట్లను పరిశీలిస్తూ ఆడిట్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో ఖాతాదారుల బంగారు ఆభరణాల ప్యాకెట్లలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విషయాన్ని జోనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తీవ్రంగా ఉండటంతో ఉన్నతాధికారులు గత వారం బ్యాంకుకు చేరుకుని పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 22 మంది ఖాతాదారులకు చెందిన సుమారు 700 గ్రాముల బంగారం గల్లంతైనట్లు గుర్తించినట్లు సమాచారం.
సెలవుపై వెళ్లిన అసిస్టెంట్ మేనేజర్
బ్యాంకు అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్న సమయంలోనే అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ గురు, శుక్రవారాల్లో సెలవుపై వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా సెలవు కావడంతో అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు మేనేజర్‌ను ఆదేశించినట్లు సమాచారం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేనేజర్ బాదావత్ మోతిలాల్ గురువారం మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.
రెండు నెలల క్రితమే బదిలీపై రాక
భూక్య రాజేష్ సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఇండియన్ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరి అనంతరం పదోన్నతులు పొందుతూ అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కర్ణాటకలోని హుబ్లీ బ్యాంకులో పనిచేసిన ఆయన సుమారు రెండు నెలల క్రితం మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకుకు అసిస్టెంట్ మేనేజర్‌గా బదిలీపై వచ్చినట్లు సమాచారం.
అయితే, మహబూబాబాద్‌కు వచ్చిన కొద్ది కాలంలోనే ఈ వ్యవహారం వెలుగులోకి రావడం బ్యాంకు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు
బ్యాంకులో బంగారం మాయమైన విషయం బయటకు రావడంతో పలువురు ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. తమ బంగారు ఆభరణాల పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు బ్యాంకుకు పెద్ద సంఖ్యలో చేరుకుని అధికారులను ప్రశ్నిస్తున్నారు. తమ బంగారం చూపించాలని మేనేజర్‌పై ఒత్తిడి చేయడంతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మొత్తం ఎంత బంగారం గల్లంతైంది, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, బంగారు ఆభరణాలను ఎక్కడెక్కడ తాకట్టు పెట్టారు అనే అంశాలపై పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Post a Comment