కుక్క టాయిలెట్ విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచి హత్య
కుక్క టాయిలెట్ విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచి హత్య
ఖమ్మం: కుక్క టాయిలెట్ పోసిన విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం చివరకు యువకుడి హత్యకు దారితీసింది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రంగనాయకుల గుట్టకు చెందిన దండేటి శ్రీనాథ్ (24) ఫ్లెక్సీ వర్కర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం (ఆగస్టు 13) రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలో కూర్చున్నాడు. అదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన వేముల మధు (28) తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాడు.
కుక్క శ్రీనాథ్ కూర్చున్న ఆటో వద్ద టాయిలెట్ పోయడంతో శ్రీనాథ్ మధును ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన మధు తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి శ్రీనాథ్‌పై విచక్షణారహితంగా ఐదుసార్లు కత్తితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన శ్రీనాథ్ సమీపంలోని కాలువలో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ ఘటనపై ఏసీపీ మాట్లాడుతూ.. శ్రీనాథ్, మధు మధ్య గతంలో ఎలాంటి కక్షలు, పరిచయం లేవని తెలిపారు. అలాగే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం కూడా లేదని, కుక్క టాయిలెట్ పోసిన విషయంపై క్షణికావేశంలో జరిగిన గొడవే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వేముల మధు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment