-->

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాష్ట్రవ్యాప్త ఆందోళన.. పలు చోట్ల ఉద్రిక్తత

 

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాష్ట్రవ్యాప్త ఆందోళన.. పలు చోట్ల ఉద్రిక్తత

పాలిటెక్నిక్‌ విద్యార్థుల రాష్ట్రవ్యాప్త ఆందోళన.. పలు చోట్ల ఉద్రిక్తత

హైదరాబాద్: జీవో 97ను రద్దు చేయాలని, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ప్రధాన రహదారులు, కళాశాలల ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు. పలు చోట్ల కళాశాలలను బంద్‌ చేయించారు.

హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇందిరాగాంధీ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్వీ నాయకులు మద్దతు తెలిపారు.

వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సంఘీభావం తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య మద్దతు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి.

యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థులు బంద్‌ నిర్వహించి, సుమారు 300 మంది ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఇంటిని ముట్టడించారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు విద్యార్థులతో చర్చించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సర్కార్‌ తీరుపై పాలిటెక్నిక్‌ జేఏసీ ఆగ్రహం

ప్రభుత్వానికే స్పష్టత లేకుండా తమను చర్చలకు పిలిచిందని పాలిటెక్నిక్‌ జేఏసీ చైర్మన్‌ నాగరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై మంత్రి చులకనగా మాట్లాడినట్లు ఆరోపించారు. ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరగనప్పుడు చర్చలు విఫలమయ్యాయా.. సఫలమయ్యాయా అనే అంశమే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.

సీఐ దురుసు ప్రవర్తనపై విచారణ

మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థుల పట్ల టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జిల్లా ఎస్పీ శబరీష్‌ స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీఐ రఘుపతిరెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసి, రూరల్‌ సీఐకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793